Director V.N Aditya Realised After Seeing UdayKiran's Depressive Death

ఉదయ్‌ని చూశాక డిసైడయ్యాను... గుణపాఠంలా మిగలకూడదని!    

సెలబ్రిటీ కాలమ్: వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు
ఒక ఉదయం అస్తమించిందన్న వార్తతో తెల్లారింది  ఆ రోజు నాకు! ఉదయ్‌కిరణ్ ఇక లేడని దాని సారాంశం. ఇంగ్లిషు నవలల్లో సీరియల్ కిల్లర్‌లాంటి వాడెవడో అజ్ఞాతంగా సినిమా పరిశ్రమ మీద పగబట్టి వరుస హత్యలు చేయిస్తున్నట్టు అనిపించింది. అవి చదువుతున్న పాఠకుడిలాగ చెమటలు పట్టి భయం వేసింది. దేవుడైతే దయుంటుంది, దయ్యం అయితే నిర్దయుంటుందని చదివాం కదా! ఇది దేవుడి పని కాదు.

విధివంచనతో అనారోగ్యం పాలై తనువు చాలించినవారు ధర్మవరపుగారు, శ్రీహరిగారు, ఏవిఎస్‌గారు అయితే, మానసిక అనారోగ్యంతో నిజ జీవితాన్ని బాధ్యతారాహిత్యంగా బలి తీసుకున్నవాడు ఉదయ్. నా మొదటి సినిమా ‘మనసంతా నువ్వే’లోను, నా రెండో సినిమా ‘శ్రీరామ్’లోను కథానాయకుడు తను. ‘‘యూ ఆర్ రిచ్ బై ఫ్రెండ్స్ అండీ’’ అనేవాడు నన్ను చూసి. నిజమే. ఫ్రెండ్స్‌ని మించిన ఆస్తి లేదు. అది లేకే తనీ రోజు నాస్తి అయిపోయాడు. తను చాలా బాగా మాట్లాడేవాడు, అంతకంటే బాగా మర్యాదగా ప్రవర్తించేవాడు. కానీ, స్నేహితుల్ని ఎందుకు కూడగట్టుకోలేకపోయాడో!

 ‘‘నేను ‘ఇంద్ర’ వందరోజుల ఫంక్షన్‌కి వెళ్లి, ఆయన అభిమానినని చెప్తే చిరంజీవి అభిమానులందరూ నా సినిమాలకి కూడా వస్తారని మా మేనేజర్ సలహా ఇచ్చారు. అతను చాలా మేధావండీ, మంచి సలహాలిస్తున్నాడు’’ అన్నాడొక రోజు. నేను, నా ఫ్రెండ్ కమ్ కో-డెరైక్టర్ శంకర్ కె. మార్తాండ్ ఉన్నాం.

ఉదయ్‌ని చూశాక డిసైడయ్యాను... గుణపాఠంలా మిగలకూడదని!
‘‘జీవితంలో ఎప్పుడూ లెక్కలేసి ఏ పనీ చెయ్యొద్దు ఉదయ్. పైవాడు ఆల్రెడీ కొన్ని లెక్కలు వేసి మనని భూమ్మీదకి పంపాడు. మనం ఆ లెక్కలకి స్టెప్పులెయ్యాలి తప్ప మళ్లీ కొత్తగా లెక్కలెయ్యకూడదు, అలా వేస్తే ఆన్సర్ కచ్చితంగా రాంగవుతుంది’’ అని చెప్పాను. సక్సెస్‌లో ఉన్నప్పుడు తన దగ్గర చేరి, చెత్త సలహాలిచ్చేవాణ్ని నమ్మాడు. అతడి లెక్కలు తలకెక్కించుకున్నాడు. చివరికి అతని లెక్క తప్పింది. అతన్నుంచి స్ఫూర్తి పొందిన వేలమందికి రాంగ్ ఆన్సరిచ్చి వెళ్లిపోయాడు.

  సినిమా పరిశ్రమలో సంబంధాలన్నీ తొంభైశాతం అవసరానికే. అందువల్ల సినిమా పరిశ్రమ గురించి అవగాహన లేని ఇంట్లోవాళ్లు అనవసరంలా అనిపిస్తుంటారు అప్పుడప్పుడూ. ఆ అగాథం పెరగకుండా చూసుకోవడం చాలా కష్టం. ఉదయ్‌ని ఆ అగాథమే ఒంటరివాణ్ని చేసింది. ఆత్మన్యూనతకి గురి చేసి, ఆత్మహత్యకి ప్రేరేపించింది. అతనితో కెరీర్ ప్రారంభంలో మంచి రిలేషన్ ఉన్న నేను, ఎమ్మెస్‌రాజుగారు, తేజగారు, ఆర్పీపట్నాయక్... అందరం మళ్లీ సక్సెస్ బాట పట్టడానికి పోరాటం చేస్తున్నాం.

 మాలో ఏ ఒక్కరు సూపర్‌హిట్ కొట్టినా, అతన్ని కూడా బయటకి లాగేవాళ్లం. మాకన్నా నటుడిగా అతనికి అవకాశాలెక్కువ. టీవీ సీరియల్ చేసినా అవసరాలు గట్టెక్కేస్తాయి. పైగా ఉదయ్ సినిమాల్లో డబ్బు గడించడమే తప్ప, మాలాగా తన డబ్బు పెట్టిన దాఖలాల్లేవు. ఎన్నో అననుకూల పరిస్థితుల్ని మొండిగా ఎదుర్కొన్నవాడు. కనీసం యుద్ధంలో ఓడిపోయి మరణిస్తే వీరుడిగా మర్యాద ఉంటుంది. కానీ శత్రువుకి తలవంచాడు. అదే నచ్చలేదు.

 ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, కృష్ణ, శోభన్‌బాబు, మోహన్‌బాబు, చిరంజీవి, శ్రీకాంత్, రవితేజ... ఇలా చాలామంది సినిమా పరిశ్రమకు చెందని కుటుంబాల నుంచి వచ్చారు ఉదయ్‌లాగా. వీరందరూ ఎప్పుడూ సక్సెస్‌లోనే లేరు. చాలా హిట్లూ  ఫ్లాపులూ చూశారు. నాకు తెలిసి పదిమందికి స్ఫూర్తినిచ్చే ఏ లెజెండ్ లేదా సెలెబ్రిటీ లైఫ్ చూసినా... వాళ్ల హిట్లు, ఫ్లాపులు కాదు, అవి రెండూ వచ్చినప్పుడు వాళ్లు పాటించిన మెంటల్ బ్యాలెన్స్ మాత్రమే వాళ్ల సక్సెస్.

అది గారడీ వాడు తీగ మీద నడిచిన దానికన్నా కష్టం. ఆ బ్యాలన్స్ తప్పి కిందపడ్డాడు ఉదయ్. నేను సినిమాల్లోకి రాకముందు మా అమ్మగారికి ఆవేశంగా చెప్పాను- ‘‘ఒక రిస్క్ తీసుకుంటానమ్మా... సక్సెస్ అయితే పదిమందికి పాఠంగా నిలబడతాను, ఫెయిలైతే పదిమందికి గుణపాఠంగా నిలబడతాను’’ అని. కానీ, ఉదయ్‌కిరణ్‌ని చూశాక కచ్చితంగా డిసైడ్ అయ్యాను, గుణపాఠంగా మిగలకూడదని.

 స్ఫూర్తి పొంది మొండిగా సినిమాల్లోకి వచ్చిన వ్యక్తి తను స్ఫూర్తినిచ్చే స్థాయికి ఎదిగాక కూడా నేర్చుకోవాల్సిన విషయాలు  ఇంకా ఉంటాయి. వాటిని తనకు నేర్పించడానికి ఉదయ్ ఒక గాడ్‌ఫాదర్‌ని ఏర్పరచుకోలేకపోయాడు. ఒక ఆత్మీయుణ్ని సంపాదించుకోలేకపోయాడు. ఇది అతని ఫెయిల్యూర్ అనలేను కానీ, అతన్ని ఫెయిల్యూర్ నుంచి కాపాడలేకపోయిన ఫ్యాక్టర్ అని అనుకోగలను. మనసు మరీ బాలేకపోతే తనతో కలిసిపని చేసిన సునీల్‌తో కాసేపు మాట్లాడినా, సునీల్ ద్వారా త్రివిక్రమ్‌ని కలిసినా స్వాంతన లభించేది.

ఆర్పీతోనో, దశరథ్‌తోనో ఓ అరగంట స్పెండ్ చేసినా ఉపశమనం కలిగేది. తేజగారి దగ్గరికో, ఎమ్మెస్ రాజు గారి దగ్గరకో వెళ్లి కాసేపు కూర్చున్నా మనశ్శాంతి లభించేది. సీతారామశాస్త్రి గారింటికో, భరణి గారింటికో వెళ్లి కూర్చున్నా జీవనపోరాటం ఎలా చేయాలో అర్థమై ఉండేది. దాసరిగారో, రాఘవేంద్రరావుగారో చెప్పేది కొద్దిసేపు మౌనంగా విన్నా బోలెడంత ఎనర్జీ వచ్చేది. వాళ్లంతా పొగడరు. స్ఫూర్తి కలిగేలా సజెస్టివ్‌గా తిడతారు. వీళ్లందరినీ ఉదయ్ ఏదో ఒక సందర్భంలో కలిశాడు.

 కలిసినప్పుడల్లా వాళ్లు తనతో సినిమా చేస్తారా చేయరా అని పరిశీలించుకుని వచ్చేసేవాడే తప్ప వాళ్లతో తను మాట్లాడడం కానీ వాళ్ల మాటలు వినడం కానీ చేయలేదు. సక్సెస్‌లో ఉన్నప్పుడు సినిమాలు చేయడానికి మనకి మనుషులతో పర్సనల్‌గా అనుబంధం అక్కర్లేదు. కానీ ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు మాత్రం అది చాలా అవసరం! ఎవ్వరితోనూ దాన్ని ఏర్పరచుకోలేకపోయాడు ఉదయ్.

అదే తను జీవితంలో మిస్సైన విషయం!
 ఎవ్వరినీ అణగదొక్కేంత సీను పరిశ్రమలో ఎవరికీ లేదు. కానీ, ఎవరైనా మనని ప్రోత్సహించేంత రిలేషన్‌షిప్ మనకుందా లేదా అన్నది మనకు మనమే చెక్ చేసుకోవాలి. ఇది ఉదయ్‌కి తెలీలేదు. అనూహ్యమైన సక్సెస్ చిన్నవయసులోనే రావడం, తన జీవితంలో జరిగిన పరిణామాలలో తనే నిర్ణయాలు తీసుకోవడం, అతనికి ఎవరన్నా మంచో, చెడో చెప్పే అవకాశం లేకుండా చేశాయి. ఇతరులతో పోల్చుకోవడం, ప్రతి పని నుంచి/వ్యక్తి నుంచి మనకు అనుకూలంగా ఫలితాన్ని ఎక్స్‌పెక్ట్ చేయడం... ఈ రెండు లక్షణాలూ ఎప్పుడూ మంచివి కావు.

 అవి ఎవర్నైనా తీవ్రమైన డిప్రెషన్‌కి గురి చేస్తాయి. అల్లరి నరేష్, శర్వానంద్, తరుణ్, నాని మంచి స్నేహితులు ఉదయ్‌కి. కానీ వాళ్లతో పోల్చుకోవడం వల్లే ఆత్మన్యూనతకి గురయ్యాడు. వీళ్లంతా ఉదయ్‌కన్నా ఎక్కువ కష్టపడ్డారు కెరీర్‌లో. నితిన్‌కి తండ్రి సపోర్ట్ ఉంది. కానీ నవదీప్ కుటుంబానికి సినిమాలతో సంబంధం లేదు. సినిమాలలో పెట్టుబడులూ లేవు. కానీ అతనికి ఇండస్ట్రీనిండా స్నేహితులే. ఈ ఎనాలిసిస్ అంతా ఉదయ్‌కి మాటల సందర్భంలో నేను చెప్పిన విషయాలే! ఇది ఇప్పుడు రాయడం వల్ల అతను తిరిగి రాడని తెలుసు. అయితే, ఈ పరిశ్రమలోకి వచ్చే కొత్తవాళ్లల్లో ఏ ఒక్కరైనా ఈ విషయాన్ని తెలుసుకుంటే అంతే చాలు!

 ఇండస్ట్రీలో సక్సెస్‌లో ఉన్నవాళ్లకి కూడా అది లేని అనుభవజ్ఞులతో ఏదో ఒక అవసరం వస్తుంటుంది. ఆ అవసరాన్ని క్యాష్ చేసుకుని కొన్నాళ్లు ఓపిగ్గా, స్థిరంగా ఉండాలి మనకి సక్సెస్ వచ్చేవరకూ. ఎప్పుడూ ఒక సినిమా తీసి ప్రూవ్ చేసుకోగలిగే అవకాశాన్ని మిగుల్చుకోవాలి.

 ఉదయ్ మంచివాడు. అమాయకంగా పరిశ్రమలోకి ఎంటరై, అనూహ్యంగా పెకైదిగాడు. తర్వాత విధి చేతిలో ఒరిగాడు. పెకైగిరాడు. ఈ ప్రస్థానంలో తప్పు పట్టాల్సినదేవన్నా ఉంటే తను తీసుకున్న నిర్ణయాలనే కానీ తనని కాదు. ఆ నిర్ణయాలకి బలవంతుడయ్యిందీ, బలయ్యిందీ కూడా అతనే!
 ఉదయ్‌ది ఒక ఉదంతం. ఒక మంచి కుర్రాడిచ్చిన చెడ్డ ఉదాహరణ! జీవితంలో నటిస్తే ఏర్పడే అగాథం ఒంటరితనం. భ్రమలో జీవిస్తే ఏర్పడే ఒంటరితనం అథఃపాతాళం.

 భగవంతుడు, జాతకం, అదృష్టం, మారుతున్న సమాజం... అన్నీ అందలమెక్కించాయి ఉదయ్‌ని. మన పక్కింటి కుర్రాణ్నో, మనింట్లో తమ్ముడ్నో చూసినట్టు మురిసిపోయింది అశేషాంధ్ర ప్రజానీకం. అందుకే అతని మరణాన్ని, దాన్ని అతను బలవంతంగా కోరుకున్న నిర్ణయాన్ని అంగీకరించలేకపోయింది. ఎవరినన్నా నొప్పిస్తే మన్నించండి!

Tags : Watch latest tollywood news,Director V.N Aditya Realised After Seeing UdayKiran's  Depressive Death,watch telugu news,watch udaykirans death,watch vn aditya realised after seeing udaykirans death., v.n.aditya, uday kiran, You are rich by Friends, indra hundred days function, యూ ఆర్ రిచ్ బై ఫ్రెండ్స్, ఇంద్ర వందరోజుల ఫంక్షన్‌, ఉదయ్‌కిరణ్, v.n. ఆదిత్య

No comments:

Post a Comment